: 'తమిళనాడు శకటాలపై జయలలిత ఫొటో'పై భగ్గుమన్న ప్రతిపక్షాలు
చెన్నైలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత ఫొటో ఆ రాష్ట్ర శకటాలపై ఉండటం వివాదాస్పదమైంది. పరేడ్ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వివిధ విభాగాల నుంచి 24 శకటాలను ప్రదర్శనకు ఉంచారు. వాటిపై ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం ఫోటో కాకుండా ఆదాయపన్ను కేసులో దోషిగా తేలిన జయ చిత్తరువును ఉంచారు. దానిపై తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలు శిక్ష పడి, బెయిల్ పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఫొటో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించడం ఎంతవరకు సముచితమో తనకు అర్థం కావడంలేదని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎంకే కూడా ఈ విషయంపై మండిపడింది. తమిళనాడులో ప్రస్తుతం జయ స్థానం ఏంటని ప్రశ్నించింది.