: ఇక కేంద్ర మంత్రిగా కవిత... మోదీ ప్రభుత్వంలో చేరేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు!
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి మరో మంత్రి పదవి దక్కనుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్, తన కేబినెట్ లో కుమారుడు కేటీఆర్ కు చోటు కల్పించారు. ఇక కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే రోజు మరెంతో దూరంలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సన్నాహాలు చేస్తోందన్న ఊహాగానాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ దిశగా టీఆర్ఎస్ నేతలు... బీజేపీ కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నేతలతోనూ చర్చిస్తున్నారట. అందులో భాగంగానే కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రులుగా పరిగణిస్తున్న హరీశ్ రావు, కేటీఆర్ తరచూ ఢిల్లీ పర్యటనలు జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి చేరువైతే, మైనారిటీలకు దూరమవుతామన్న భయంతో నిన్నటిదాకా వెనకడుగు వేసిన టీఆర్ఎస్, తాజాగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న అభిప్రాయంతోనే మోదీ సర్కారులో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో, బీజేపీతో చేయి కలిపి రాష్ట్రానికి ఆశించిన మేర నిధులు రాబట్టుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. మోదీ సర్కారులో చేరితే, కవితతో పాటు మరొకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని టీఆర్ఎస్ కోరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అటు, ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ, మోదీ సర్కారులో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో, తమ కంటే ఏపీకే ఎక్కువ నిధులు విడుదలవుతున్నాయని భావిస్తున్న కేసీఆర్, బీజేపీలో చేరే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.