: వైట్ హౌస్ గార్డెన్లో కూలిన మానవ రహిత విమానం... గుర్తించలేకపోయిన రాడార్లు


అమెరికా అధ్యక్షుడు ఒబామా భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి. అత్యాధునిక రాడార్ వ్యవస్థతో గాల్లో కాగితం ఎగిరివచ్చినా పసిగడతామని చెప్పుకునే భద్రతా దళాలు ఒక డ్రోన్ (మనవ రహిత చిన్న విమానం) ఎగిరివచ్చి వైట్ హౌస్ గార్డెన్లో కూలిపోతే గుర్తించలేకపోయాయి. ఈ ఘటన సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి) జరిగింది. ఈ డ్రోన్ దారితప్పి వచ్చి కూలింది కాబట్టి సరిపోయింది. కానీ, ఎవరైనా కావాలని ఈ తరహా చిన్న విమానంతో దాడి చేసినా సెక్యూరిటీ అధికారులు గుర్తించలేరన్న విషయం ప్రపంచానికి తెలిసింది. భద్రతపై ఇప్పటికిప్పుడు సమాధానాలు లేని ప్రశ్నలను సృష్టించింది. రెండు అడుగుల పొడవు, 2 పౌండ్లు (సుమారు 900 గ్రాములు) బరువున్న ఈ డ్రోన్ ఒబామా నివాసంలోని తోటలో కూలింది. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు దాన్ని వైట్ హౌస్ సమీపంలో ఎగురవేస్తుంటే అది అదుపు తప్పిందని అధికారులు గుర్తించారు. అతను ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో పలుమార్లు అధ్యక్షుడి భద్రతపై అనుమానాలు తలెత్తే ఘటనలు జరిగాయి. గత సెప్టెంబరులో ఓ వ్యక్తి వైట్ హౌస్ ప్రహరీ గోడను దూకగా, 2011లో ఒక వ్యక్తి వైట్ హౌస్ పై కాల్పులు జరిపడం తెలిసిందే.

  • Loading...

More Telugu News