: పాక్ లో ‘హ్యూస్’ తరహా ఘటన... బంతి తగిలి యువ క్రికెటర్ మృత్యువాత
ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ దుర్మరణం మరచిపోకముందే అదే తరహా ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. బలంగా దూసుకొచ్చిన క్రికెట్ బంతి తగిలి, పాక్ యువ క్రికెటర్ దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం పాక్ పట్టణం ఓరంగిలో జరిగిన క్లబ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ లో భాగంగా ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతి పాక్ యువ క్రికెటర్ జీషన్ మొహమ్మద్ ఛాతీకి బలంగా తగిలింది. దీంతో మొహమ్మద్ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెనువెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బంతి బలంగా తగలడంతో గుండె తీవ్ర ఒత్తిడికి గురైందని, ఆస్పత్రికి రాకముందే మొహమ్మద్ మరణించాడని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.