: గణతంత్ర వేడుకల్లో 'బుల్లెట్ రైలు'కు విశేష స్పందన
భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ వేదికగా దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. కాగా, భారత రైల్వే వ్యవస్థలో త్వరలోనే ప్రవేశించనున్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ నమూనాను కూడా రిపబ్లిక్ డే పెరేడ్ లో ప్రదర్శించారు. రైల్వే శాఖ శకటంపై బుల్లెట్ రైలు నమూనా పెరేడ్లోకి రాగానే వీక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. కరతాళధ్వనులతో వారు 'బుల్లెట్ రైలు'కు స్వాగతం పలికారు. రైల్వే శకటం రాగానే ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు విక్టరీ సింబల్ చూపారు. మొత్తం రూ.63,000 కోట్లతో పట్టాలెక్కనున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రస్తుతం అధ్యయనం దశలో ఉంది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో ఈ హైస్పీడ్ రైలు సాధ్యాసాధ్యాలపై కసరత్తులు జరుగుతున్నాయి.