: పద్మ విభూషణ్ అవార్డుతో సంతోషంలో మునిగిపోయా: అమితాబ్
కేంద్ర ప్రభుత్వం తనను పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అమితానందం వ్యక్తం చేశారు. తన పట్ల ప్రేక్షకులు చూపుతున్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. 72 ఏళ్ల బిగ్ బీని గతంలో పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు వరించాయి. తాజాగా విభూషణ్ కూడా దక్కడంతో కృతజ్ఞత వ్యక్తం చేయడానికి ఎలాంటి మాటలు లేవంటున్నారు. "దేశం అత్యంత ఉన్నతమైన 'పద్మ' అవార్డుతో భారత ప్రభుత్వం నన్ను గౌరవించింది. ఈ సందర్భంగా నాకు మాటలు రావడంలేదు. చాలా గౌరవప్రదంగా భావిస్తున్నా" అని తన బ్లాగ్ లో ఈరోజు పోస్టు చేశారు. ఇప్పుడు తన కుటుంబం జాతీయస్థాయి ప్రశంసలతో కూడిన ఏడు అవార్డులు పొందిందని వెల్లడించారు. "నా తండ్రి: పద్మశ్రీ, పద్మ భూషణ్. అర్ధాంగి జయ: పద్మశ్రీ, కోడలు ఐశ్వర్య: పద్మశ్రీ, ఏబీ (అమితాబ్): పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్. ఒకే కుటుంబంలో ఇందరు పద్మ అవార్డులు దక్కించుకోవడం దేశంలో మరెక్కడా లేదేమో" అంటూ బ్లాగ్ లో బిగ్ బి రాసుకొచ్చారు.