: గ్యాస్ రాయితీ రావట్లేదా?... ఇలా చేయండి!


నగదు బదిలీ వ్యవహారంలో అయోమయం నెలకొంది. పింఛన్లు పొందుతున్న వారికి వంట గ్యాస్ రాయితీ అందటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు జాతీయ బ్యాంకుల్లో కానీ, తపాలా కార్యాలయాల్లో కానీ ఖాతాలను ఆరంభించాలని తెలుగు రాష్ట్రాల్లోని పౌరసరఫరాల శాఖల అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదు బదిలీ ప్రైవేటు, చిన్న చిన్న బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదంటూ సాధారణ వినియోగదారుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తుండటంతో, వారంతా జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరచి వాటిని గ్యాస్ డీలర్ల వద్ద అనుసంధానం చేయించుకోవాలని సూచిస్తున్నారు. యాక్సిస్, ఐసీఐసీఐ తదితర బ్యాంకుల్లోని ఖాతాలు నగదు బదిలీతో అనుసంధానమై రాయితీ వాటిలో జమవుతుంటే ఆ ఖాతాలు మార్చుకోనక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు. పింఛన్ల విషయంలో యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులు ఆసక్తి చూపకపోవటంతోనే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో, ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరిపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పింఛనుదారులు, వంట గ్యాస్ రాయితీ అందనివారు జాతీయ బ్యాంకు లేదా తపాలా ఖాతా వివరాలను గ్యాస్ డీలర్లకు అందజేయాలని, జీరో నిల్వతో బ్యాంకు ఖాతాను తెరిచినవారు ముందుగా బ్యాంకు ఖాతాలో ఎంతో కొంత మొత్తం వేసి దాన్ని విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. కనీసం ప్రతి 45 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఒక్కసారైనా లావాదేవీలు నిర్వహిస్తేనే ఆ ఖాతా క్రియాశీలకంగా వుండి, రాయితీ జమ చేయటంలో ఇబ్బందులు తలెత్తవని వివరించారు.

  • Loading...

More Telugu News