: వీళ్లకు 'పద్మ' అవార్డులా... ప్రజాగ్రహాన్ని తొలిసారి చవిచూస్తున్న మోదీ!


నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలిసారిగా 'పద్మ' అవార్డులను ప్రకటిస్తూ, పలువురు గురువులను, హిందూ మఠాధిపతులను, బీజేపీ నాయకులను, గతంలో వారికి సహకరించిన వారినీ జాబితాలో చేర్చారన్న వార్తలు వచ్చిన తరువాత సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యోగా గురు బాబా రాందేవ్ కు పద్మభూషణ్ ఇవ్వడంపై ఎందరో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు కేసులు, అత్యాచార ఆరోపణలు ఉన్న రాందేవ్ కు అంత ఘనమైన పురస్కారాన్ని ఎలా ఇస్తారని ప్రశ్నలు సంధిస్తున్నారు. "రాందేవ్ బాబా పద్మభూషణ్ కు అర్హుడైతే కచ్చితంగా నేను కూడా భారతరత్నకు అర్హుడినే" అని ఒకరు, "దొంగ బాబాకు అవార్డు ఇచ్చి మోదీ ప్రభుత్వం దొంగ అయిపోయింది" అని ఇంకొకరు, "రాందేవ్ కు అవార్డు ఇచ్చిన తరువాత మోదీ సాధించిన విజయాలు వెనక్కిపోయాయి" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక గడచిన ఎన్నికల్లో బీజేపీ ప్రచార చిత్రాలకు పనిచేసినందునే సంజయ్ లీలా భన్సాలి, గేయ రచయిత ప్రసూన్ జోషి, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ లకు అవార్డులు దక్కాయని విమర్శలు వస్తున్నాయి. మత గురువులు తేగ్ సీ రింపోచే (తవాంగ్ కమ్యూనిటీ), శివకుమార స్వామి (తుమకూరు మఠాధిపతి), జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య (తులసి పీఠం), స్వామి సత్యమిత్రానంద్ గిరి (సమన్వయ కుటీర్, హరిద్వార్)లకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వడంపైనా ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి మోదీ సర్కారు ఏం సమాధానం ఇస్తుందో వేచిచూడాలి.

  • Loading...

More Telugu News