: పింఛన్ అడిగిన మహిళ చెంప చెళ్లుమనిపించిన టీ కాంగ్ కౌన్సిలర్... కామారెడ్డిలో ఘటన
ఆమె ఓ పండు ముదుసలి. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ తో నిశ్చింతగా జీవించొచ్చని భావించింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధిని ఆశ్రయిస్తే, పింఛన్ అందకపోతుందా, అనుకున్న ఆమెకు ఊహించని విధంగా చెంప దెబ్బ తగిలింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మునిసిపాలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... పట్టణంలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి, పింఛన్ ఇప్పించాలని తమ వార్డు కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేత నర్సింలును వేడుకుంది. ముసలమ్మకు సాయం చేయాల్సిన నర్సింలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. వృద్ధురాలి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో ఆసరా కోసమొస్తే, చెంపదెబ్బ తగిలిన లక్ష్మి రోధిస్తూనే, పోలీస్ స్టేషన్ లో నర్సింలుపై ఫిర్యాదు చేసింది.