: సెన్సార్ బోర్డు నూతన నియామకాలను సమర్థించుకున్న కేంద్రం
కేంద్ర సెన్సార్ బోర్డుకు కొత్త చైర్మన్ ను, సభ్యులను నియమించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అన్ని వర్గాలకు సెన్సార్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడమే తమ అభిమతమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారన్న విమర్శలపై ఆయన స్పందించారు. గత ప్రభుత్వ తరహాలో విధేయులకే పట్టం కట్టారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాము కొత్తగా నియమించిన వ్యక్తులకు ఇతర పార్టీలతోనూ సంబంధాలున్న విషయాన్ని గుర్తించవచ్చని చెప్పారు. ఇక, సెన్సార్ బోర్డు చైర్మన్ గా పహ్లాజ్ నిహలాని ఎంపికపై మాట్లాడుతూ... ఆయన సుప్రసిద్ధ దర్శకుడని, ఆ పదవికి తగిన వ్యక్తి అని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులుగా ఎంపికైన నటి జీవిత ఇటీవలే బీజేపీలో చేరగా, బెంగాల్ నటుడు జార్జ్ బేకర్ సార్వత్రిక ఎన్నికల్లో హౌరా నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై పోటీచేశారు. తమిళ నటుడు, రచయిత ఎస్వీ శేఖర్ రెండేళ్ల క్రితమే కమల తీర్థం పుచ్చుకున్నారు.