: మా మధ్య నీ గోల ఏంటి?: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో జపాన్ ను తప్పుబట్టిన చైనా
'అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగమే' అని జపాన్ వ్యాఖ్యానించినందుకు చైనా తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. గత వారంలో జపాన్ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా భారత పర్యటనకు వచ్చినపుడు ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "ఈ మాటలు అభ్యంతరకరం. ఇండియా, చైనా మధ్య వివాదాల గురించి మీకెందుకు? జపాన్ పై ద్వైపాక్షిక నిరసన తెలుపుతాము. మా నిరసన జపాన్ పై ప్రభావం చూపకముందే వివరణ ఇస్తే మంచిది" అని చైనా అధికార ప్రతినిధి హోంగ్ లీ అన్నారు. కాగా, ఈనెల 17న న్యూఢిల్లీలో కిషిడా మాట్లాడుతూ, "అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగంగా వుంది. ఆ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు సాగుతున్నాయి. సరిహద్దు వివాదం కూడా వుంది. ఆ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ లో మేము ఇప్పట్లో పెట్టుబడులు పెట్టలేము" అని ఆయన అన్నారు.