: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల్లో దుమారం రేపిన అందగత్తెల ఫొటో


లెబనాన్, ఇజ్రాయిల్... ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మంటుంది. అలాంటిది రెండు దేశాల అందాల సుందరీమణులు కలసి సందడి చేసిన ఫొటో కనిపిస్తే ఇక చెప్పేదేముంది! ఇటీవలే ఆ ఫొటో సోషల్ మీడియాకు ఎక్కింది. ఇంకేముంది, రెండు దేశాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. విషయం ఏమిటంటే... 2014 మిస్ యూనివర్స్ పోటీలకు లెబనాన్ తరపున శాలీ గ్రేయిగ్, ఇజ్రాయిల్ తరపున డొరోన్ మెటలోన్ ఎంపికయ్యారు. జనవరి 25న మయామీలో జరిగే మెయిన్ ఈవెంట్ కోసం వారు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జపాన్, స్లొవేనియా అందగత్తెలతో కలసి దిగిన చిత్రాన్ని మెటలోన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. ఆ ఫొటోలో లెబనాన్ సుందరి శాలీ గ్రేయిగ్ కూడా ఉంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా లెబనాన్ లో నిరసనల సెగ రాజుకుంది. జపాన్, స్లొవేనియా ఫ్రెండ్స్ తో కలసి 'సెల్ఫీ' దిగుతుంటే కావాలనే మెటలోన్ అడ్డుగా వచ్చి తమతో కలిసిందని శాలీ గ్రేయిగ్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలలో దుమారాన్ని, ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తోందీ చిత్రం!

  • Loading...

More Telugu News