: త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు: రాజ్ నాథ్
దేశంలో మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో కొత్త గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. బీహార్, పంజాబ్, అసోంలతో కలిపి దాదాపు ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, "15 లేదా 20 రోజుల్లో ఆరు నుంచి ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని ప్లాన్ చేస్తున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం బీహార్, అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల గవర్నర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు పంజాబ్ గవర్నర్ శివరాజ్ సింగ్ పాటిల్ ఈ నెల 21న, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఊర్మిళాసింగ్ ఈ నెల 24న పదవి నుంచి వైదొలగనున్నారు. ఇదిలాఉంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠీ అదనంగా బీహార్, మేఘాలయ, నాగాలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య అదనంగా అసోం, త్రిపుర రాష్ట్రాలను చూస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ గవర్నర్ కేకే పాల్ అదనంగా మణిపూర్ చూస్తున్నారు. ఇటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఒరిస్సా గవర్నర్ ఎస్ సీ జామిర్ లు కొన్ని నెలల్లో రిటైర్ కానున్నారు.