: తెలుగు నేలపై ‘మైక్రో’ ఆగడాలకు చలించిన బిర్లా కూతురు... ‘స్వతంత్ర’కు అంకురార్పణ!


భారత పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అనన్యా బిర్లా, తెలుగు రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు సాగించిన దమనకాండకు చలించిపోయిందట. ఆ కలచివేతే ఆమెను ‘స్వతంత్ర’ సంస్థ ఏర్పాటు దిశగా అడుగులేయించింది. ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ రంగంలో వేధింపులకు చోటులేని, అధిక వడ్డీల ఊసులేని రుణాలను ‘స్వత్రంత్ర’ అందిస్తోంది. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్ విద్యనభ్యసిస్తున్న 21 ఏళ్ల అనన్యా బిర్లా, ఏటా కొన్ని నెలల పాటు భారత్ లో ఉంటూ స్వతంత్రను శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఏపీలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదలను అధిక వడ్డీలతో జలగల్లా పీడించాయి. వాయిదాలు చెల్లించని వారి ఇళ్లలోని సామాన్లను బయటపడేసిన ఆ సంస్థలు, పెద్ద సంఖ్యలో మహిళల ఆత్మహత్యలకు కూడా కారణమయ్యాయి. ఈ దురాగతాలపై వెలువడ్డ పలు వార్తా కథనాలతో చలించిన అనన్యా బిర్లా, మైక్రో ఫైనాన్స్ పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ‘స్వతంత్ర’ను స్థాపించింది. తండ్రి సహకారంతో నిధులను సమీకరించుకున్న అనన్యా బిర్లా, వ్యాపారంలో సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఆ సంస్థను 18 శాఖలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అధిక వడ్డీ భారం లేని రుణాలతో పేదలను ఆదుకునేందుకు దృఢ సంకల్పంతో ఆమె ముందుకు సాగుతోంది.

  • Loading...

More Telugu News