: మ్యాప్ మధ్యలో గీత గీసినట్టుగా రాష్ట్రాన్ని విభజించారు: వెంకయ్య నాయుడు
కడపలో నిర్వహించిన సభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్సాహభరితంగా ప్రసంగించారు. గత పదేళ్లలో కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందన్నారు. మ్యాప్ మధ్యలో గీత గీసినట్టుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆరోపించారు. ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా, ఎన్నికలకు కొద్దిముందుగా విభజన చేశారని విమర్శించారు. అయితే, బీజేపీ రాకతో పరిస్థితి మారిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుక్షణం అభివృద్ధి అజెండాతో ముందుకెళుతున్నారని తెలిపారు. బీజేపీ సర్కారు సమస్యలను ఒకదాని తర్వాత ఒకదాన్ని తీరుస్తుందని స్పష్టం చేశారు. గుజరాత్ లో ముస్లింల తలసరి ఆదాయం అందరికంటే ఎక్కువ ఉందని వెంకయ్య ఈ సందర్భంగా వివరించారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను పక్కనబెట్టి చైనా, రష్యా తదితర దేశాలు ముందుకెళుతున్నాయని తెలిపారు. సిద్ధాంతాలలో కాలానుగుణ మార్పులు చేర్పులతో దేశాన్ని ముందుకుతీసుకెళ్లాలన్నారు. ఇక, రాయలసీమపై ఆయన వరాల జల్లు కురిపించారు. కడప జిల్లాలో డీఆర్డీవో అనుబంధ సంస్థ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సీమకు కూడా వరమేనన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సీమలో నీటి కొరత తగ్గుతుందన్నారు. ఏదేమైనా అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదన్నారు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ అన్న తేడా చూడబోమని స్పష్టం చేశారు. తమకు అభివృద్ధే ముఖ్యమన్నారు. అంతకుముందు, వెంకయ్యనాయుడు సమక్షంలో కందుల సోదరులు, మాజీ ఎమ్మెల్యే సరస్వతమ్మ బీజేపీలో చేరారు. వెంకయ్య పార్టీ కండువా కప్పి వీరిని బీజేపీలో సాదరంగా ఆహ్వానించారు.