: పురుషులకు పోప్ సలహా
మహిళలు చెప్పేది శ్రద్ధగా వినాలనంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని క్యాథలిక్ విశ్వవిద్యాలయం యువజన సభలో ఆయన పాల్గొన్నారు. మహిళల ఆలోచనలకూ విలువ ఇవ్వాలని ఈ సందర్భంగా పురుషులకు సూచించారు. పురుష దురంహకారం వీడాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారని, అదే సమయంలో మగవాళ్లు పురుష దురహంకారుల్లా తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. మనీలా సభలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడాన్ని గమనించిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సభలో తనను ప్రశ్నలడిగిన ఐదుగురిలో ఒక్కరే మహిళ అని తెలిపారు. ఆమె 12 ఏళ్ల బాలిక అయినా, తననెంతో కష్టమైన ప్రశ్న అడిగిందని పోప్ చెప్పుకొచ్చారు. చిన్నారులు వీధిబాలలుగా మారడాన్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడని ఆ బాలిక ప్రశ్నించిందని చెప్పారు. ఇక, తన ప్రసంగాన్ని ముగిస్తూ, తన తర్వాతి పోప్ మనీలా వచ్చినప్పుడు సభలో మరింతమంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు.