: హస్తినలో మళ్లీ హంగే... ముందస్తు సర్వేల అంచనా!
దేశ రాజధాని అసెంబ్లీలో మళ్లీ హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ముందస్తు సర్వేలు అంచనా వేస్తున్నాయి. వచ్చే నెల ఏడో తేదీన జరుగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, కొంచెం అటూఇటుగా 2013లో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయని ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చింది. ఈ సర్వే ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. 2013 ఎన్నికల్లో బీజేపీకి 32 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో రెండు సీట్లు అదనంగా మొత్తం 34 స్థానాలు దక్కే అవకాశముంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 36 ఎమ్మెల్యే సీట్లు అవసరం. బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఇక ఆప్, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి గతంతో పోలిస్తే ఏమాత్రం మారలేదని, గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లే రావచ్చనే అంచనాలున్నాయి.