: అప్పుడే మరిచిపోయారా?: మోదీపై కిరణ్ బేడీ, షాజియాల ట్వీట్లను గుర్తు చేసిన ఆప్!
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ, మాజీ టీవీ వ్యాఖ్యాత షాజియా ఇల్మీలకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. గతంలో వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతూ ట్విట్టర్ లో కాషాయీకరణపై నిప్పులు చెరిగారు. తాజాగా సరిగ్గా ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదైన తర్వాత ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరూ బీజేపీలో చేరిపోయారు. ఈ చేరికలతో సాధారణంగానే ఆప్ షాక్ కు గురైంది. అయితే, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాత్రం... కిరణ్ బేడీ రాజకీయాల్లోకి రావడం హర్షించదగినదంటూ వ్యాఖ్యానించారు. కానీ, ఆయన పార్టీ నేతలు మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా జీర్ణించుకున్నట్లు లేరు. బీజేపీలో చేరి తమకు షాకిచ్చిన కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలను వదిలిపెట్టేది లేదంటూ తీర్మానించుకున్నట్లున్నారు. గతంలో మోదీపై కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలు అంతెత్తున ఎగిరిపడుతూ విమర్శలు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నాడు వారిద్దరూ తమ ట్విట్టర్ ఖాతాల్లో మోదీపై ఎక్కుపెట్టిన విమర్శనాత్మక పోస్టింగులను మళ్లీ సోషల్ నెట్ వర్క్ సైట్లలో పెడుతూ వారిని ఇబ్బందులకు గురి చేయాలని యత్నిస్తున్నారు. మరి ఆప్ యత్నాలపై కిరణ్, ఇల్మీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.