: మేము అమెరికన్లమే... ప్రవాస భారతీయులం కాదు... బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్య
అధికారం కోసం, ప్రజల ఓట్ల కోసం నేతలు ఎలాంటి మాటలైనా మాట్లాడతారనడానికి, తదుపరి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడతాడని భావిస్తున్న లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ వ్యాఖ్యలే నిదర్శనం. నాలుగు దశాబ్దాల క్రితం తన తల్లిదండ్రులు అమెరికన్లుగా మారేందుకే యూఎస్ కు వచ్చారని, ఇండియన్-అమెరికన్లుగా ఉండిపోవాలని కాదని ఆయన అన్నారు. బాబీ జిందాల్ వలసవాది అని, వంశమూలాలు అమెరికా భూభాగంలోనివి కాదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. "నా తల్లిదండ్రులు 'అమెరికన్' కలను నెరవేర్చుకోవడానికి వచ్చారు. విజయం సాధించారు. వారికి సంబంధించి ఇది కేవలం ఒక ప్రాంతం కాదు... ఒక ఆలోచన. మనం అమెరికన్లుగా ఉండేందుకు అమెరికా వచ్చాము. ఇండియన్-అమెరికన్లుగా ఉండేందుకు కాదు అని మా అమ్మ, నాన్న చెప్పారు" అని బాబీ జిందాల్ అన్నారు. "భారతీయులుగా ఉండాలని భావిస్తే మేము అక్కడే ఉండేవాళ్ళం. అంతమాత్రాన ఇండియా అంటే అయిష్టం అని కాదు. మరిన్ని అవకాశాల కోసం, మరింత స్వాతంత్ర్యం కోసం మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు" అని తెలిపారు. ఎంత ఎదిగినా మూలాలను మరువరాదనే విషయాన్ని మరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం విమర్శలకు తావిస్తోంది.