: లంచం అడుగుతున్న ఎంఎల్ఏలు... మహిళలను వేధిస్తున్న ఉన్నతాధికారులు... వెల్లువెత్తిన ఫిర్యాదులు
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ప్రజలు గళం విప్పారు. లంచాలు మరిగిన ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శుల వరకు విధుల్లో భాగంగా వెలగబెడుతున్న అవినీతి బాగోతాన్ని కుప్పలుతెప్పలుగా బయటపెడుతున్నారు. ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పొరపాటున ఫోన్ కాల్స్ వివరాలు మీడియాకు విడుదల చేశారు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు, అధికారుల బాగోతం పేర్లతో బయటకు వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మెల్యే ఒకరు పింఛన్ల మంజూరు కోసం లంచాలు వసూలు చేస్తుండగా, మెదక్ జిల్లాలోని మరో ఎమ్మెల్యే తనతో పని కావాలంటే డబ్బులు అడుగుతున్నారు. మెదక్ జిల్లా వైద్యాధికారి ఒకరు లంచాల కోసం, ఓ అదనపు వైద్యాధికారి తన కోరికలు తీర్చాలని మహిళలను వేధిస్తున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు లంచాలు అడుగుతూ, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది డబ్బుల కోసం రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఇవ్వకుంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. గత నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 10,750 ఫోన్ కాల్స్ రాగా, అందులో 500 వరకూ అవినీతిపై వచ్చాయి. ఫిర్యాదులపై ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఆరా తీశారు.