: జోరందుకున్న ఆప్ విరాళాల సేకరణ... ఒక్కరోజు కలెక్షన్ రూ. కోటీ!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రచారంలో తలమునకలైంది. కాంగ్రెస్, బీజేపీలకు నిధుల సమస్య లేనప్పటికీ, ఆప్ ను మాత్రం నిత్యం నిధుల లేమి వెక్కిరిస్తోంది. అయితే మునుపటి ఫలితాల కంటే మెరుగైన రీతిలో రాణించాలని కంకణం కట్టుకున్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మంగళవారం ఒక్కరోజే కోటి రూపాయల మేర విరాళాలను సేకరించగలిగారు. ‘లంచ్ విత్ అరవింద్ కేజ్రీవాల్’ పేరిట విందు ఏర్పాటు చేసిన ఆప్, దాని ద్వారా రూ.66 లక్షలను వసూలు చేసింది. ఈ విందులో పాల్గొనేవారు కనీసం రూ.20 వేలు పార్టీకి విరాళమివ్వాల్సి ఉంది. అయితే నిన్నటి విందుకు హాజరైన పలువురు వ్యాపారులు రూ.20 వేల కంటే ఎక్కువే ఇచ్చారట. ఇదిలా ఉంటే, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ నేతలు చందాల రూపంలో రూ.44 లక్షలు సేకరించారని ఆ పార్టీ వాణిజ్య విభాగం కన్వీనర్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు.

  • Loading...

More Telugu News