: హైదరాబాదును వణికించిన చలి... కేవలం ఆరు డిగ్రీలే
హైదరాబాదీలను చలిపులి వణికించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న పొడి శీతల గాలుల ప్రభావం హైదరాబాదుపై పడింది. దీంతో హైదరాబాదులో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రెండు రోజుల క్రితం 10 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత నమోదైన హైదరాబాదులో గత రాత్రి కేవలం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ మన్యంలో గత రాత్రి మంచువర్షం కురిసినట్టు సమాచారం. లంబసింగి, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో చలిపులికి మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరో నాలుగు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.