: చేనును మేసిన కంచె... ఆదాయ పన్ను శాఖలో భారీ కుంభకోణం!


పన్ను ఎగవేతదారులపై నిఘా వేస్తూ అక్రమార్కులకు వణుకు పుట్టిస్తున్న ఆదాయ పన్ను శాఖలో భారీ అవినీతి భాగోతం వెలుగు చూసింది. బడా కంపెనీలు, నల్లధనాన్ని కూడబెడుతున్న అవినీతి తిమింగలాల అక్రమ లావాదేవీలను పరిష్కరించే క్రమంలో ఆ శాఖకు చెందిన జాయింట్ కమిషనర్... ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు, ఓ వ్యాపారవేత్త, కొందరు మధ్యవర్తులతో కలిసి సీబీఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆదాయ పన్ను శాఖ విచారణ విభాగంలో జాయింట్ కమిషనర్ (చెన్నై) గా పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి సలోంగ్ యాడెన్... చార్టర్డ్ అకౌంటెంట్లు సంజయ్ బండారి, శ్రేయ బండారి, రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ ఒకరితో కలిసి బడా సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ స్థాయిలో లంచాలు స్వీకరించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై ఉప్పందిన సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. విషయాన్ని నిర్ధారించుకుని శనివారం చెన్నైతో పాటు ముంబైలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చెన్నైలో ఓ బడా వ్యాపారి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటున్న సలోంగ్ యాడెన్ ను సీబీఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. యాడెన్ అరెస్ట్ ను సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ ధ్రువీకరించారు. ఆదాయ పన్ను శాఖ ఇటీవల జరిపిన దాడుల్లో భాగంగా ఓ వ్యాపారి నుంచి భారీ ఎత్తున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఈ కేసును మాఫీ చేసుకునే క్రమంలో సదరు వ్యాపారి సలోంగ్ యాడెన్ ను ఆశ్రయించారు. కేసును మాఫీ చేసే క్రమంలోనే యాడెన్ ఆ వ్యాపారి నుంచి లంచం స్వీకరిస్తూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మరిన్ని వివరాలను వెలికితీసేందుకు యాడెన్ తో పాటు అరెస్ట్ చేసిన ఇతర వ్యక్తులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News