: ఉగ్రవాదానికి భయపడేది లేదు... 'చార్లీ హెబ్డో' శాంతిర్యాలీకి పది లక్షల మంది హాజరు
'చార్లీ హెబ్డో' మృతులకు సంతాపం తెలుపుతూనే, ఉగ్రవాదానికి ఏమాత్రం భయపడేది లేదని ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఆదివారం జరిగిన భారీ ర్యాలీ ద్వారా ప్రజలు చాటిచెప్పారు. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి, తదనంతర దాడుల్లో మరణించిన 17 మందికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తున్న శాంతి ర్యాలీకి హాజరుకావాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ర్యాలీలో పది లక్షల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. ఇక, ఫ్రాన్స్ కు బాసటగా నిలిచిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ లతో పాటు వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖులు ర్యాలీలో కదం తొక్కారు. ఊహించని స్పందనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఉప్పొంగిపోయారు. ‘పారిస్... ఫ్రాన్స్ కు మాత్రమే రాజధాని కాదు. ఇకపై ప్రపంచానికి రాజధాని’’ అని ఆయన ప్రకటించారు. అంతేగాక, ఉగ్రవాద దాడులకు ఏమాత్రం జడిసేది లేదని ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ముక్తకంఠంతో నినదించారు.