: ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది: మోదీ
ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉజ్వల గుజరాత్ సభలో ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి భారత్ ఐదో అతిపెద్ద ఎగుమతుల దేశంగా అవతరిస్తుందని అన్నారు. తాము మాటలకంటే చేతలకే ప్రాధాన్యమిస్తామని చెప్పిన మోదీ, జన్ ధన్ యోజన ద్వారా కేవలం 100 రోజుల్లోనే 10 కోట్ల బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశామని అన్నారు. ప్రపంచం వసుధైక కుటుంబం అని భారత్ భావిస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలని భారత్ కాంక్షిస్తోందని, టెర్రరిజానికి ప్రపంచంలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ అంటే నగరాలు, పట్టణాలే కాదని, పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని ఆయన పేర్కొన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చినందుకు ఐక్యరాజ్యసమితికి ధన్యవాదాలని ఆయన తెలిపారు. భారత్ లో ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీల నిర్మాణం చేపడతామని ఆయన వెల్లడించారు. తయారీ రంగంలో భారత్ ను హబ్ గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. సాగరమాల పేరిట ఓడరేవుల నిర్మాణం చేపడతామని, ఓడరేవులను అనుసంధానిస్తామని ఆయన వివరించారు. పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చామని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.