: మిమ్మల్ని ఎవరైనా డబ్బులడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి... తోలు తీస్తా: కేసీఆర్
ఎలాంటి పనికోసమైనా ఏ అధికారికి గానీ, మధ్యవర్తులకు గానీ లంచం ఇవ్వకండని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా లంచం అడిగితే, నా నంబరుకు ఫోన్ చేసి చెప్పండని... డబ్బులడిగిన వారి తోలు తీస్తానని చెప్పారు. ఫోన్ నెంబర్ 040- 23454071 అని వెల్లడించారు. ఈ నెంబరును టోల్ ఫ్రీ చేస్తామని, పైసా ఖర్చు లేకుండా ఫోన్ చేసి లంచం అడిగిన వారి వివరాలను తెలియజేయాలని కోరారు. గత నాలుగు రోజులుగా వరంగల్ లో పర్యటిస్తున్న కేసీఆర్... ఈ రోజు బహిరంగ సభలో పాల్గొన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రజలందరికీ అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. వరంగలో లోని తొమ్మిది బస్తీల్లో తాను పర్యటించానని... గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదని అన్నారు. 9 కాలనీల్లోని పేదలకు 3,957 ఇళ్లు మంజూరు చేశామని... నాలుగు నెలల్లో పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల్లో వరంగల్ ను అద్దంలా తయారు చేస్తానని చెప్పారు. తాము చేస్తున్న మంచి పనులపై కొన్ని పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.