: టీమిండియా బౌలింగ్ పై మాజీల ఆందోళన


టీమిండియా బౌలింగ్ పై మాజీ క్రికెటర్లు ఆందోళన వెలిబుచ్చారు. పేలవంగా బౌలింగ్ చేస్తే వరల్డ్ కప్ లో ఆశించిన ఫలితాలు రాబట్టడం కష్టమని అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో బౌలింగ్ చేసిన విధంగా వరల్డ్ కప్ లోనూ బౌలింగ్ చేస్తే టైటిల్ కాపాడుకోవడం కష్టమేనని అజర్ అన్నాడు. బౌలర్లు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే ముక్కోణపు సిరీస్ అనంతరం టీమిండియా బౌలర్లు ఎంత ఫిట్ గా ఉంటారో చూడాల్సి ఉంటుందన్నాడు. వరల్డ్ కప్ జరిగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని మ్యాచ్ వేదికలు వేటికవే విభిన్నంగా ఉంటాయని, ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్లు కష్టించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇక, కోహ్లీ విషయానికొస్తూ, అతడు దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికాడీ మాజీ కెప్టెన్. ఆటగాళ్లు దూకుడు కలిగి ఉండడం మంచిదేనని, అయితే, కెప్టెన్ గా వ్యవహరించే వ్యక్తి తగు మోతాదులోనే దూకుడు కలిగి ఉండాలని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్ దిగ్గజం లక్ష్మణ్ మాట్లాడుతూ, సరైన ప్రాంతాల్లో బంతులు వేయడంలో బౌలర్లు విఫలమవుతున్నారని అన్నాడు. ఆసీస్ తో టెస్టు సిరీస్ లో ఆ విషయం తేటతెల్లమైందని తెలిపాడు. టెస్టుల్లోనే ఓవర్ కు ఐదుకు పైగా పరుగులిస్తున్నారని, వన్డేల్లో ఏంచేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బౌలింగ్ పై దృష్టిపెట్టాలని సూచించాడు.

  • Loading...

More Telugu News