: సిడ్నీ టెస్టు ఇలా ముగిసింది!


సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లకు 252 పరుగులు మాత్రమే చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అజింక్యా రహానే (38 నాటౌట్)... భువనేశ్వర్ కుమార్ (20 నాటౌట్) జతగా పోరాటపటిమ కనబర్చడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి తప్పించుకుంది. 217 పరుగులకే భారత్ 7 వికెట్లు కోల్పోగా, వీరిద్దరూ ఆసీస్ బౌలింగ్ దాడులకు ఎదురొడ్డి నిలుచున్నారు. కంగారూ బౌలర్లలో స్టార్క్, లియాన్, హేజిల్ వుడ్ తలో రెండు వికెట్లు తీశారు. వాట్సన్ కు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు, ఆట ఆరంభంలో భారత్ కు ఓ మోస్తరు శుభారంభమే లభించింది. తొలి వికెట్ కు 48 పరుగులు జోడించిన అనంతరం ఓపెనర్ రాహుల్ వెనుదిరిగాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులే చేశాడు. అయితే, మరో ఓపెనర్ విజయ్ (80), రోహిత్ శర్మ (39), కెప్టెన్ కోహ్లీ (46) రాణించినా వెంటవెంటనే వెనుదిరగడంతో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడ్డట్టు కనిపించింది. దానికి తోడు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సురేశ్ రైనా రెండో ఇన్నింగ్స్ లోనూ పరుగులేమీ సాధించకుండానే వెనుదిరగడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. అటు, వికెట్ కీపర్ సాహా కూడా డకౌట్ కాగా, ఆల్ రౌండర్ అశ్విన్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ దశలో రహానే, భువనేశ్వర్ జోడీ టెస్టును కాపాడుకునేందుకు మొండి పట్టుదల ప్రదర్శించింది. ఒక్కో ఓవర్ ను కాచుకుంటూ, చివరికి మ్యాచ్ ను డ్రా దిశగా మళ్లించింది. ఈ టెస్టులో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఎంపికయ్యాడు. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' కూడా స్మిత్ కే దక్కడం విశేషం. 4 టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ను ఆసీస్ 2-0తో చేజిక్కించుకోవడం తెలిసిందే. ఈ సిరీస్ లో స్మిత్ మొత్తం 4 మ్యాచ్ లాడి 769 పరుగులు చేశాడు. అతడి పరుగుల సగటు 128.16 కాగా, 4 సెంచరీలు, 2 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. స్మిత్ తర్వాత ఈ సిరీస్ లో అత్యధికంగా పరుగులు సాధించింది విరాట్ కోహ్లీయే. ఈ ఢిల్లీ డైనమైట్ 4 టెస్టుల్లో 692 పరుగులు చేశాడు. సగటు 86.50 కాగా, 4 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News