: స్వైన్ ఫ్లూపై భయపడొద్దు... కాకినాడ వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కాలేదు: మంత్రి కామినేని
స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వ్యాధి నివారణ, చికిత్సలపై ఇప్పటికే వైద్యాధికారులను అప్రమత్తం చేశామని చెప్పిన ఆయన, చికిత్సకు అవసరమయ్యే ఏర్పాట్లు చేశామన్నారు. కాకినాడకు చెందిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఏపీలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రజల్లోని భయాందోళనలను తొలగించే క్రమంలో మంత్రి ప్రకటన చేశారు. కాకినాడకు చెందిన బాధితుడి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపామని చెప్పిన మంత్రి, సదరు వ్యక్తికి వ్యాధి నిర్ధారణ కాలేదని తెలిపారు.