: కడపలో శాంతిభద్రతలు ఓకేనా?: పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం
ఫ్యాక్షన్ కు పుట్టిల్లుగా పేరుగాంచిన కడప జిల్లాలో శాంతిభద్రతలపై ఏపీ డీజీపీ జేవీ రాముడు దృష్టి సారించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడిపై వైసీపీ నేతలు విరుచుకుడ్డారు. సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ భేటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లాలో శాంతిభద్రతలపై దృష్టి సారించిన డీజీపీ, జిల్లా పోలీసు అధికారులతో నేటి ఉదయం సమావేశమయ్యారు. జిల్లాలో తాజా పరిస్థితులపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. అదే సమయంలో జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేసే అంశంపై కూడా డీజీపీ చర్చించినట్లు తెలుస్తోంది.