: శశిథరూర్ కు పోలీసుల షాక్... సునంద కేసులో థరూర్ పనిమనిషిని విచారించిన సిట్!
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన ఇంటి పనిమనిషి నారాయణ సింగ్ ను పోలీసులు గురువారం మరోమారు సుదీర్ఘంగా విచారించారు. సునంద మరణానికి ముందు ఆమెను ఎవరెవరు కలిశారు? ఆమె శరీరంపై గాయాలెలా అయ్యాయి? తదితర విషయాలపై గుచ్చిగుచ్చి మరీ ప్రశ్నలు సంధించారు. అనారోగ్యం కారణంగానే ఆమె ఔషధాలు వినియోగించారా? లేక ఆ రోజు మాత్రమే గోళీలు వేసుకున్నారా? అన్న విషయంపై కూడా సింగ్ ను సిట్ పోలీసులు విచారించారు. హోటల్ గదిలో లభించిన రెండు మాత్రలపైనా పోలీసులు ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉంటే, ఈ కేసు విచారణలో మరింత దూకుడు పెంచిన పోలీసులు థరూర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేకాక థరూర్ నూ పోలీసులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కేరళలోని గురువాయూర్ లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న థరూర్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.