: ఊహలకు రెక్కలొస్తే ఇలా ఉంటుంది!
పని కారణంగా పూర్తిగా అలసిపోయినప్పుడు సునాయాసంగా ఇంటికి చేరితో ఎంత బాగుంటుందో అనుకోని వ్యక్తులుండరు. అలాంటప్పుడు, ఓ కారు మన దగ్గరకు రాగానే డోర్ దానంతట అదే తెరుచుకుని, మీరు ఎక్కి కూర్చునేందుకు వీలుగా సీటు బయటికి వచ్చి, అందులో మీరు కూర్చున్నాక, అది యథాస్థానానికి మారిపోయి మీకు సంబంధం లేకుండానే డోర్ లాక్ అయి, మీరు ఎక్కడకు వెళ్లాలో అడిగి మీరు రిలాక్స్ అవుతుంటే, గమ్యస్థానం చేర్చే కారుంటే ఎంత బాగుండు! అనుకుంటున్నారా?... వచ్చేశాయ్ ఊహలకు రెక్కలు వచ్చేశాయి! సాంకేతిక పరిజ్ఞానం తారస్థాయిని తాకుతోంది. దీంతో, ఈ ఊహను జర్మనీ కార్ల కంపెనీ మెర్సిడెస్ నిజం చేసింది. స్వీయ చోదక.. అంటే.. సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది. గతేడాది గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును విడుదల చేసినప్పటికీ, చూసేందుకు ఆకట్టుకునేలా లేకపోవడంతో దానికి అంత ఆదరణ లభించలేదు. లాస్ వెగాస్ ప్రదర్శనలో మెర్సిడెస్ ప్రదర్శించిన ఎఫ్015 అనే కారు సందర్శకుల మది దోచుకుంది. 17 అడుగుల పొడవు, ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ కారు ఒకసారి చార్జ్ చేస్తే 1100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ప్రతి విండోకు టచ్ స్క్రీన్ సౌకర్యం ఉంది. వాటి సాయంతో కారును కంట్రోల్ చేస్తూ, బయటి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. టచ్ స్క్రీన్ ప్యానెల్స్ ను టచ్ ద్వారే కాకుండా కంటి చూపుతో కూడా ఆపరేట్ చేసే సౌకర్యం కల్పించారు. మూడ్ బాగుంటే మనమే డ్రైవ్ చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా రూపకర్తలు కల్పించారు. అయితే, ఈ కారు ఇంకా అందుబాటులోకి రాలేదు. కారును నడపాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కంపెనీ వీటి తయారీపై పూర్తి వివరాలు అందజేయలేదు. ఇవి మార్కెట్ లో కొస్తే ఇక రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయనడంలో సందేహంలేదు. పైగా కారు ప్రయాణం ఆహ్లాదకరంగా మారుతుంది.