: 'చార్లీ హెబ్డో'పై 'ఉగ్ర' దాడిని ఖండించిన ఐరాస
పారిస్ లోని 'చార్లీ హెబ్డో' పత్రిక కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఖండించారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై జరిగిన దాడి అని, భయానకమైన ఈ దాడిని ఏ విధంగానూ సమర్థించలేమని బాన్ కీ మూన్ పేర్కొన్నారు. ముసుగులు ధరించిన కొందరు దుండగులు 'చార్లీ హెబ్డో' కార్యాలయంపై దాడి చేయడంతో 12 మంది మరణించడం తెలిసిందే. మృతుల్లో పత్రిక ఎడిటర్, నలుగురు కార్టూనిస్టులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు బాన్ కీ మూన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకే ఇలాంటి దాడులకు పాల్పడతారని, ఎవరూ ఆ ఉచ్చులో పడకూడదని అన్నారు. అందరం సంఘటితంగా ఉండాల్సిన సమయమిదని పేర్కొన్నారు. విద్వేష శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.