: అవకాశం కోసమే గాంధీ విదేశాలకు వెళ్లారు: మోదీ
ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రవాస భారతీయులకు మన దేశంలోనే అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన 'ప్రవాసీ భారతీయ దివస్' కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని... మనమంతా ఒక శక్తిలా పనిచేస్తే కనీవినీ ఎరుగని ఫలితాలను సాధిస్తామని చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు పాలుపంచుకోవాలని... దీంతో, మన గ్రామాలు ఉజ్వలంగా వెలుగుతాయని తెలిపారు. మహాత్మా గాంధీ కూడా కేవలం అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారని... భరతమాత స్వేచ్ఛ కోసం తిరిగి వచ్చారని మోదీ అన్నారు. ఏ దేశంలో ఉన్నప్పటికీ మన దేశ సంప్రదాయాలను, సామర్థ్యాన్ని భారతీయులు చాటుతున్నారని కొనియాడారు. తాము సూచించిన యోగా దినోత్సవ నిర్వహణకు 177 దేశాలు మద్దతు పలికాయని గుర్తు చేశారు.