: సిడ్నీ టెస్టులో నేడు ఓకే... రేపేంటి?
సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ (140 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (110) సెంచరీలు సాధించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట చివరికి 5 వికెట్లకు 342 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో, నాలుగో రోజు ఆటపై ఆసక్తి నెలకొంది. క్రీజులో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ కు భారీ స్కోరు సాధించిపెడతాడా? లోయరార్డర్ తో కలిసి జట్టును సురక్షిత స్థితికి చేర్చుతాడా? అన్నది రేపటి ఆటలో తేలనుంది. అంతకుముందు, ఓవర్ నైట్ స్కోరు 71/1 తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ కాసేపటికే రోహిత్ శర్మ (53) వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ లియాన్ బంతికి బౌల్డయ్యాడు. ఈ దశలో ఓపెనర్ రాహుల్ కు జత కలిసిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రాహుల్ నిదానంగా ఆడినా కళాత్మక షాట్లతో అలరించడం విశేషం. ఈ క్రమంలో అతడి సెంచరీ పూర్తయింది. అయితే, ఈ కర్ణాటక యువ కిశోరం లెఫ్టార్మ్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 238/3. ఆ తర్వాత వచ్చి రహానే (13) పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలోనే కోహ్లీ శతకం పూర్తయింది. ఇన్నింగ్స్ సజావుగా సాగుతోందనుకుంటున్న దశలో వాట్సన్ రెచ్చిపోయాడు. రహానేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఈ ఆసీస్ ఆల్ రౌండర్, అదే ఊపులో రైనాను డకౌట్ చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతికే రైనా వికెట్ కీపర్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో, భారత్ కష్టాల్లో పడినట్టు కనిపించింది. కానీ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (14 బ్యాటింగ్) అండగా కోహ్లీ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ జోడీ ఆరో వికెట్ కు అజేయంగా 50 పరుగులు చేయడంతో భారత్ 300 మార్కు దాటింది.