: ఒక బుల్లెట్ కు నాలుగు బుల్లెట్లతో జవాబిస్తున్నాం: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తుండడంపై మాట్లాడుతూ, "వారు ఒక్క బుల్లెట్ పేల్చితే, మనం నాలుగు బుల్లెట్లతో జవాబిస్తున్నాం" అని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. పాక్ దుశ్చర్యలకు పాల్పడుతున్నా, ఇక్కడి ప్రజలు చూపుతున్న నిబ్బరం పట్ల తాను సంతోషిస్తున్నానని మంత్రి అన్నారు. భద్రతా దళాలు దీటుగా బదులివ్వడం పట్ల తాము సంతృప్తికరంగానే ఉన్నామని ప్రజలు చెబుతున్నారని వివరించారు. సామాన్య పౌరులపై పాకిస్థాన్ కాల్పులు జరపడాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని అన్నారు. కేంద్రంలో సర్కారు మారడంతో, వాతావరణం కూడా మారిన విషయం పాక్ కు అర్థమై ఉంటుందని అన్నారు. పరిస్థితి మారిందని స్పష్టం చేశారు. చాన్నాళ్ల తర్వాత పాక్ దాడులను మన భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టడం ఇదే ప్రథమమని అన్నారు.