: సీటు స్పాంజ్, లగేజీ స్థానాల్లో కట్టలు... కారులో మూడు కోట్ల రూపాయల నగదు!
సాధారణంగా కారు సీటు కవర్ కింద కుషన్ ఉంటుంది. లగేజీ స్థానంలో డ్రెస్సులతో కూడిన బ్యాగులు ఉంటాయి. అయితే చెన్నైలో ప్రమాదానికి గురైన ఓ కారులో కుషన్, డ్రెస్సుల స్థానంలో నోట్ల కట్టలున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు... 300 కట్టలకు పైగా వెలుగు చూసిన ఈ నోట్ల కట్టలను కనుగొన్న పోలీసులు షాక్ తిన్నారు. అసలే ఉగ్రవాద సంచారం నేపథ్యంలో తీవ్ర స్థాయిలో సోదాలు జరుగుతుంటే, ఏమాత్రం భీతి లేకుండా ఓ వ్యక్తి రూ.3 కోట్లకు పైగా నగదును ఎంచక్కా కారులో తరలించేందుకు పూనుకున్నాడు. అయితే కోయంబత్తూరు సమీపంలో సేలం-కోచి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో సదరు కారులోని నగదు బయటపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయపడగా, కారు డోర్లు కూడా విరిగిపోయాయి. దీంతో కారులోని నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న అక్కడి జనం తండోపతండాలుగా వచ్చి దొరికినకాడికి పట్టుకెళ్లారు. కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, రూ.500 డినామినేషన్ లోని 490 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి ప్రజలు కూడా పట్టుకెళ్లిన మొత్తంతో కలుపుకుంటే కారులో తరలిస్తున్న నగదు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అసలు అంతపెద్ద ఎత్తున నగదు ఎవరికోసం తరలిస్తున్నారని ఆరా తీస్తున్నారు.