: కాంగ్రెస్ పోటీ ఎక్కడ?... భారత్ లోనా? పాకిస్థాన్ లోనా?: అమిత్ షా
ఉగ్రవాదుల కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే, ఆ పార్టీ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ తీరంలో పాక్ కు చెందిన ఓడ పేలుడుపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఈ మేరకు ఘాటుగా ప్రతిస్పందించారు. సున్నితమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని నిలువరించే బాధ్యతను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకోవాలని సూచించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు మద్దతుగా నిలబడాల్సిన గురుతర బాధ్యతను కాంగ్రెస్ విస్మరిస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు చేస్తున్న పోరుకు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వెన్నుదన్నుగా నిలబడాల్సి ఉందని ఆయన సూచించారు.