: మమత మేనల్లుడికి జడ్ ప్లస్ భద్రత... మండిపడిన బీజేపీ
మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జడ్ ప్లస్ భద్రత కల్పిస్తుండడంపై బీజేపీ మండిపడింది. బెనర్జీని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో పోల్చుతూ పలు విమర్శలు చేసింది. బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "అభిషేక్ బెనర్జీ ఇప్పుడు రాబర్ట్ వాద్రాలా తయారవుతున్నారు. సోనియా అల్లుడిగా వాద్రా ఢిల్లీలోనూ, దేశ వ్యాప్తంగానూ ఎంతో దర్జా వెలగబెట్టారు. ఇప్పుడు అదే తరహాలో, మమత మేనల్లుడిగా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో సూపర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వెలుగొందుతున్నట్టు కనిపిస్తోంది" అని అన్నారు. బెనర్జీకి కల్పిస్తున్న జడ్ ప్లస్ సెక్యూరిటీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు కూడా లేదని తెలిపారు. గవర్నర్ అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడని అన్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టడం తెలిసిందే. అనంతరం ఆ వ్యక్తిని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీని చెంప మీద కొట్టిన ఆ వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం గమనార్హం.