: ఆర్కే కోసం 'ఆపరేషన్ ఆలౌట్'... తప్పించుకున్న నక్సల్ అగ్రనేత!
ఒడిశాలోని బేజంగి అటవీప్రాంతంలో పోలీసులు 'ఆపరేషన్ ఆలౌట్' నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే), మల్కన్ గిరి జిల్లా కార్యదర్శి ఉదయ్ తదితరులే లక్ష్యంగా ఈ 'ఆపరేషన్ ఆలౌట్' చేపట్టారు. ఆ సమయంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే, కాల్పులకు ముందే అక్కడి నుంచి ఆర్కే, ఇతరులు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశామని తెలిపారు. జనవరి ప్రథమార్థంలో బేజంగి అడవుల్లో ప్లీనరీ నిర్వహిస్తారని, అక్కడికి ఆర్కే తప్పక వస్తాడని పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగానే ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ఆలౌట్ కు శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్, మల్కన్ గిరి జిల్లా ఎస్పీ మహాపాత్రో ఈ స్పెషల్ ఆపరేషన్ కు రూపకల్పన చేశారు.