: తాళాలు లాక్కొని ఆంధ్రాకు నీటి విడుదల... సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత!
నాగార్జున సాగర్ డ్యాంలోని నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ఆంధ్రా ఏఈ వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యోగి నుండి బలవంతంగా తాళం చెవులు లాక్కొని తానే స్వయంగా కుడికాల్వ ద్వారా నీటిని విడుదల చేశారని పలువురు తెలంగాణా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో, సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాగర్ జలాశయంలో ఆంధ్రా వాటా పూర్తయిందని, ఈ సీజన్‌లో ఒక్క చుక్క కూడా ఇచ్చేదిలేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంటే, ఇంకా తమకు 101 టీఎంసీల నీరు రావాలని ఆంధ్రా ప్రభుత్వం వాదిస్తోంది. తెలంగాణ ఉద్యోగిపై దాడి చేసి తాళాలను బలవంతంగా లాక్కొని నీటిని విడుదలకు చేసిన వెంకటేశ్వరరావుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఎందుకు చేయలేదని తెలంగాణా ఉద్యోగులు డివిజన్ కార్యాలయ ఉన్నతాధికారులను నిలదీశారు. కాగా, డ్యాం ఉన్నతాధికారులు ఇరుపక్కల ద్వారాలను మూసివేసి ఎవరినీ డ్యాంపైకి వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి డ్యాం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.