: టాటా సంస్థపై కేసుపెట్టిన డొకోమో
వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ పై జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ ఎన్‌టీటీ డొకోమో కేసు పెట్టింది. టాటా సన్స్ తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది. టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్ లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది. ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ లండన్‌లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టులో అప్పీలు చేసుకున్నట్లు డొకోమో వెల్లడించింది. కాగా, ఇరు సంస్థల మధ్య వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది.