: మోదీని ఇరకాటంలోకి నెడుతున్న కేరళ బీజేపీ
'ఘర్ వాపసీ' పేరిట హిందుత్వ వాదులు ప్రోత్సహిస్తున్న మత మార్పిళ్లను బీజేపీ కేరళ విభాగం సమర్థించుకుంటోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంటీ రమేశ్. 'ఘర్ వాపసీ' కార్యక్రమానికి ప్రధాని మోదీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. హిందూ మతం నుంచి అన్యమతాల్లోకి వెళ్లినవారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం చట్టసమ్మతమేనని అన్నారు. కొచ్చిలో ఆయన మాట్లాడుతూ, "ఘర్ వాపసీ కార్యక్రమం కొత్తదేమీ కాదు. ఇదో నిరంతర స్రవంతి. మతం మారిన హిందువులను తిరిగి తీసుకురావడం కొనసాగుతూనే ఉంటుంది. మతమార్పిడి చట్టసమ్మతమే అయితే, మత పునఃమార్పిడి అన్యాయమెలా అవుతుంది?" అని ప్రశ్నించారు. వీర్ సావర్కర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ (వీఎస్ఐబీఎస్) లో జరిగిన ఓ కార్యక్రమంలో రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ పాత మతంలోకి వచ్చే క్రమంలో న్యాయపరమైన సమస్యలేవీ ఎదురుకావని స్పష్టం చేశారు.