: అధికారంలో కొనసాగే నైతిక హక్కు తృణమూల్ కు లేదు: బుద్ధదేవ్ భట్టాచార్జీ
శారదా చిట్ ఫండ్ కుంభకోణం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నానాటికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటిదాకా మమత సర్కారుపై బీజేపీ దాడి చేస్తే, తాజాగా ఆమె చేతిలో ఓటమిపాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సినియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్జీ ప్రత్యక్ష దాడికి దిగారు. రాష్ట్రంలో పరిపాలన కొనసాగేందుకు తృణమూల్ కాంగ్రెస్ కు నైతిక హక్కు లేదని బుద్ధదేవ్ అన్నారు. ‘‘శారదా స్కాంలో ఆ పార్టీ నేతలు ఎలా పాలుపంచుకున్నారో మాకు తెలుసు. బెంగాల్ రాజకీయ చరిత్రలో ఈ తరహా కుంభకోణం జరగలేదు. సాక్షాత్తు కేబినెట్ మంత్రి జైలుకెళ్లారు. దీంతో ఆ పార్టీ నేతల ప్రమేయం చెప్పకనే చెబుతోంది’’ అని ఆరోపించిన బుద్ధదేవ్, మమతా బెనర్జీ తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఇకపై ఒక్క క్షణం కూడా రాష్ట్రంలో పాలన సాగించేందుకు తృణమూల్ కు నైతిక హక్కు లేదని ఆయన తేల్చిచెప్పారు.