: ప్రేమికుడితో వెళ్లిన వివాహిత... పంచాయతీ తీర్పుతో చిత్రహింసలు
ప్రేమించిన వ్యక్తిని మరచి ఉండలేక అతనితో వెళ్లిపోయిన గిరిజన వివాహితను వెతికి పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టారు పంచాయతీ పెద్దలు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని ఉదయఘడ్ సమీపంలోని వధా గ్రామంలో జరిగింది. ఊరు వదిలి గుజరాత్ వెళ్లిన వారిద్దరినీ వెతికితెచ్చి అందరూ చూస్తుండగా హింసించారు. తలచుకుంటే వెన్నులో వణుకు పుట్టేంత కఠిన శిక్షలను వారికి విధించారు. సదరు యువతి భర్త వారిస్తున్నా, చిత్రహింసల విషయంలో పంచాయతీ పెద్దలు పట్టువిడవలేదని తెలిసింది. ఈ యువతి ఇద్దరు పిల్లలకు తల్లి అని, వారిని వదిలి ప్రియుడితో లేచిపోవడం క్షమించరాని నేరమని గిరిజన పంచాయతీ పెద్దలు వ్యాఖ్యానించారు. యువతి ఫిర్యాదు మేరకు గ్రామ సర్పంచ్ ధన్ సింగ్, మరో 10 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.