: గోవాకు ప్రత్యేక హోదా రావడం కష్టమే: సీఎం పర్సేకర్
న్యాయపరమైన అడ్డంకులు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా గోవాకు ప్రత్యేక హోదా లభించడం కష్టమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్దన్ ను కలసిన అనంతరం సీఎం పైవిధంగా మీడియాతో మాట్లాడారు. "గోవాకు ప్రత్యేక హోదా లభించాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ చట్టం పరిధిలోనే మా లక్ష్యాన్ని ఆచరణాత్మక, ఆచరణ సాధ్యంగా చేస్తాం. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే నేను కూడా సంతోషిస్తా. కానీ అది చాలా కష్టతరమైందంటున్నా. అందుకే ఇతర ప్రయత్నాలు కూడా పరిశీలించాలి" అని వివరించారు. అయితే ప్రత్యేక హోదాపై తమ డిమాండ్ ను వెనక్కు తీసుకోమని, కష్టతరమని మాత్రమే చెప్పగలనన్నారు. తమ ప్రత్యేక గుర్తింపును, భూమి వనరులను క్షీణతను రక్షించుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గోవా డిమాండ్ చేస్తోంది. దానిపై ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయగా, అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా లేఖ రాశారు.