: ఆర్థిక సాయం కోరితే అవమానించాడు!
ఆర్థిక సాయం కోసం వెళితే శివసేన ఎమ్మెల్యే తనను అవమానించారంటూ ఆరోపిస్తున్నాడు మహారాష్ట్రకు చెందిన ఓ కిక్ బాక్సర్. శేఖర్ సక్తే అనే ఈ మార్షల్ ఆర్ట్స్ యోధుడు థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగే వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2015లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బ్యాంకాక్ వెళ్లేందుకు అవసరమైన ఖర్చులు ఇతనే భరించాల్సి ఉండడం, అది శక్తికి మించిన పని కావడంతో ఎవరినైనా సాయం అడుగుదామనుకున్నాడు. ఓ ఫంక్షన్లో శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేకు విషయం వివరించాడు. ఎంట్రీ ఫీజు స్వయంగా చెల్లించాల్సి ఉందని తెలిపాడు. దీంతో, శేఖర్ కు సాయం చేయాల్సిందిగా ఎంపీ స్థానిక ఎమ్మెల్యే బాలాజీ కినికర్ కు సూచించారు. ఆ తర్వాత శేఖర్ ఓ రోజు కినికర్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ అతనికి అవమానం ఎదురైంది. షిండేను ఎందుకు కలిశావంటూ ఎమ్మెల్యే అందరిముందే ఆ కిక్ బాక్సర్ ను దుర్భాషలాడాడు. అంతేగాకుండా, తన వద్ద డబ్బు లేకపోతే ఎవరినీ యాచించనని అన్నాడట. ఈ వ్యవహారంపై శేఖర్ మీడియాతో మాట్లాడాడు. తిట్టొద్దని కోరానని, తనను అవమానించే హక్కు లేదని ఎమ్మెల్యేకు స్పష్టం చేశానని శేఖర్ తెలిపాడు. ఇక, కినికర్ కార్యాలయం నుంచి బయటికి రాగా, అతని అనుచరులు ఆపి చేతిలో రూ.10000 పెట్టారని, వద్దన్నానని చెప్పాడు. కానీ, వారు వినిపించుకోలేదని, తర్వాత గురువారం నాడు ఎమ్మెల్యేని కలిసి ఆ మొత్తం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించినా తీసుకునేందుకు నిరాకరించారని వివరించాడు. అతను ప్రజాప్రతినిధి కావడంతో అందరికీ సాయం చేస్తాడని భావించడం తప్పని తేలిందని శేఖర్ వాపోయాడు. ఇక, ఈ కిక్ బాక్సర్ ఆర్థిక కష్టాలు తెలుసుకున్న అంబర్ నాథ్ సిటిజన్స్ ఫోరమ్ సాయపడేందుకు ముందుకొచ్చింది. అటు, ఎమ్మెల్యే కినికర్ తన వాదన వినిపించారు. తన నిధులలోంచి కొంత మొత్తం ఇచ్చానని, అయితే, అతను తన గురించి దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.