: చంద్రబాబు జ్ఞాపకశక్తి అమోఘం... 12 ఏళ్ల తర్వాత వికలాంగుడిని పేరు పెట్టి పిలిచిన వైనం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి అమోఘమైన జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలిచే ఓ ఘటన గురువారం విజయవాడలో జరిగింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం తనను కలిసిన ఓ వికలాంగుడిని చంద్రబాబు పేరు పెట్టి మరీ పిలిచారు. వివరాల్లోకెళితే... గతంలో సీఎంగా పనిచేసిన సమయంలో బెజవాడకు చెందిన వికలాంగుడు దుర్గారావు ఆయనను కలిశాడు. విద్యుత్ షాక్ కు గురైన దుర్గారావు రెండు చేతులను వైద్యులు మోచేతుల దాకా తీసేశారు. నాడు దుర్గారావును చంద్రబాబు పరామర్శించారు. తాజాగా గురువారం నగరంలోని లబ్బీపేట వెంకటేశ్వరస్వామి గుడికి వెళుతున్న కాన్వాయ్ ను ఆపి చంద్రబాబుకు గ్రీటింగ్స్ చెప్పేందుకు దుర్గారావు యత్నించాడు. ఈ సమయంలో అతడిని పేరు పెట్టి పిలిచిన చంద్రబాబు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక చదువు పూర్తికాగానే ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం కలిసిన తనను చంద్రబాబు ఏకంగా పేరు పెట్టి పిలవడంతో దుర్గారావు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.