: మోదీ యాడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్!
మత మార్పిళ్ళకు సంబంధించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రజలకు వివరణ ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారు. ఇందులో భాగంగా కుల, మత, వర్గాల కంటే దేశాభివృద్ధే తమకు ప్రధానమని చెప్పేలా ఓ వాణిజ్య ప్రకటన రూపకల్పనకు మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రకటనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీవీ తెరలపై కనిపించనున్న ఈ యాడ్ లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ కూడా కనిపించనున్నారు. ఇక ఈ యాడ్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ‘‘విద్యకు కులముందా? అభివృద్ధికి మతముందా? ప్రగతి ఏ వర్గానికి చెందినది?‘‘ తరహా ప్రశ్నలతో అమితాబ్ దేశ ప్రజలను ప్రశ్నించనున్నాడు. చేతిలో గాలిపటంతో కనిపించే అమితాబ్ సంధించే ప్రశ్నలు, తమ అజెండాను ప్రజలకు చేరవేయనున్నాయని మోదీ సర్కారు విశ్వసిస్తోంది. కులమతాలకతీతంగా అభివృద్ధి సాధించండన్న ప్రధాన నినాదంతో ఈ యాడ్ రూపొందింది.