: కోడి పందాలను ఆపడం ఎవరి తరం కాదు: టీడీపీ ఎమ్మెల్యే
సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో, పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అప్పుడే పలుచోట్ల కోడిపందాలు ప్రారంభమయ్యాయి కూడా. ఈ సందర్భంగా, పందాలు ఆడుతున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయగా... వారిని విడుదల చేయాలని కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నా కూడా చేశారు. ఓవైపు కోడిపందాలను అరికట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీచేస్తే, మరోవైపు పందాలను కొనసాగించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, కోడి పందాలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యాటక శాఖ ద్వారా వీటిని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా, నాలుగు రోజుల పాటు ఈ పందాలను ఆపడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. అరెస్టులు చేసినా పందాలను వేయకుండా ప్రజలను నియంత్రించలేరని చెప్పారు. అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఈ పందాలలో పాల్గొంటారని తెలిపారు.